TRENDING POST





వృక్షో రక్షతి రక్షితః..చెట్లను కాపాడండి..అవి మనల్ని కాపాడతాయనేది దీని సారాంశం. కానీ, మహబూబ్‌ నగర్‌కు చెందిన సదాశివయ్య మాత్రం  అంటున్నారు. 

జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు గత పదేళ్లుగా కృషి చేస్తున్నారీ ఆచార్యుడు. ఒకప్పుడు పాముల్ని చూడగానే భయమేసి చంపేసిన ఆయన..తర్వాత వాటిని చంపకూడదని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి రెండు వేల పైచిలుకు పాములను రక్షించారు. 

వందల పాఠశాలల్లో దీనిపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అంతే కాదు, దీనికోసం ఓ సంస్థను ఏర్పాటు చేసి జీవ వైవిధ్యంపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. 

ముఖ్యంగా పాముల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ వాటికి స్నేహితుడిగా మారారు. పాముకాటు మరణాలు లేని తెలంగాణే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. 

వృత్తి పరంగా వృక్షశాస్త్ర ఆచార్యుడైన ఆయన.. పాముల గురించి అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా పామును చూడగానే అదెక్కడ కాటేస్తుందోనన్న భయంతో వాటిని కొట్టి చంపేస్తారని, అసలు వాటి జోలికి వెళ్లకపోతే అవి కూడా ఏం చేయవని చెబుతున్నారీయన. 

మనం వాటిని రక్షణ కల్పిస్తే..అవి కూడా మనల్ని కాపాడతాయని అంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చెర్లలోని బూర్గుల రామాకృష్ణరావు ప్రభుత్వ కళాశాలలో సదాశివయ్య వృక్షశాస్త్ర ఆచార్యుడిగా పని చేస్తున్నారు. 

పీహెచ్‌డీ చేసేటప్పుడు సదాశివయ్య ఓకానొక సందర్భంలో భయపడి పామును కొట్టి చంపారట. తర్వాత ఆలోచన వెంటాడటంతో ఇకపై పాములకు అపాయం తలపెట్టకూడదని నిర్ణయించుకున్నారట. 

తన పీహెచ్‌డీలో భాగంగా వృక్ష, జంతుశాస్త్రాలపై పరిశోధన చేశారు. ఇందులో భాగంగా పాముల గురించి కూడా తెలుసుకున్నారు. అప్పటి నుంచి వాటిపై ప్రేమ పెంచుకున్నారు. 

2010 నుంచి పాములను కాపాడే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఎక్కడైనా పాము కనిపిస్తే తనకు సమాచారం ఇవ్వాలని విస్తృత ప్రచారం కూడా కల్పిస్తున్నారు. వృత్తిరీత్యా స్వస్థలాన్ని వదిలి మహబూబ్‌ నగర్‌కు రావడంతో మీడియా ద్వారా ప్రచారం కల్పించారు. ఆయన నివాసం నుంచి 30కి.మీ పరిథిలో ఎక్కడ పాము ఉందని తెలిసినా అక్కడకు వెళ్లి రక్షించేవారు. 

నాగుపాము, కట్లపాము, రక్త పింజర లాంటి విషసర్పాలు, కొండచిలువ లాంటి భారీ సర్పాలు, జర్రిపోతు తదితర విషరహిత సర్పాలనెన్నిటినో పట్టుకుని అడవుల్లో వదిలారు. 

ఆచార్యుడిగా పనిచేస్తున్నప్పటికీ పాములను పట్టడం మాత్రం వదిలిపెట్టలేదు. పట్టుకున్న పాముల్ని వారం నుంచి పదిరోజుల పాటు తమ వద్దే ఉంచుకుంటారు. 

తర్వాత వాటిని తీసుకెళ్లి పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఇలా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 630 పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 

‘అసోసియేషన్‌ ఫర్‌ బయోడైవర్సిటీ కన్సర్వేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్(ఏబీసీడీ)’పేరుతో  సంస్థను ఏర్పాటు చేసి దీని ద్వారా ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు.

Comments